విడుదల తేదీ : 7 ఆగష్టు 2015 TeluguArea.asia : 4/5 దర్శకుడు : కొరటాల శివ నిర్మాత : నవీన్, రవి శంకర్, మోహన్ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ నటీనటులు : మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూసిన సినిమా ‘శ్రీమంతుడు’. మిర్చితో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివతో కలిసి మహేష్ బాబు చేసిన ఈ పర్ఫెక్ట్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ యాక్టర్స్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ ని కమర్షియల్ యాంగిల్ లో చెప్పడానికి ట్రై చేసిన ఈ ‘శ్రీమంతుడు’ సినిమా ఆభిమానుల అంచనాలను అందుకునేలా ఉందా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
శ్రీమంతుడు సినిమా ఆకాశంలో మొదలవుతుంది. అనగా ఓ స్పెషల్ ఏరోప్లేన్ లో ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత రవికాంత్ (జగపతిబాబు)గా ఎంట్రీ ఇస్తాడు. ఆయన కుమారుడే మన హీరో హర్ష వర్ధన్(మహేష్ బాబు). తన స్టడీస్ మొత్తం పూర్తి చేసుకున్న హర్ష వచ్చి తన బిజినెస్ చూసుకుంటాడని అనుకుంటాడు రవికాంత్, కానీ హర్ష మాత్రం దానికి విరుద్దంగా తనకి సంతృప్తిని ఇచ్చే దానికోసం వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో హర్ష ఓ రోజు చారుశీల(శృతి హాసన్)ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. కానీ హర్ష ప్రపోజ్ చేసే టైంకి చారుశీలకి హర్ష రవికాంత్ వారసుడని తెలుస్తుంది. దాంతో తన సొంత ఊరు ఏదో కూడా తెలియని వారికి నేను సరిపడనని చెప్పి హర్ష ప్రేమని తిరష్కరిస్తుంది.
చారుశీల ద్వారా తన ఊరు దేవరకోట అని తెలుసుకున్న తానెవరో చెప్పకుండా ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ చారుశీల నాన్నగారైన నారాయణరావు(రాజేంద్ర ప్రసాద్) తో కలిసి ఆ ఊరిని డెవలప్ చేయడం మొదలు పెడతాడు. కానీ మంచి పనులను అడ్డుకోవడానికి ఓ విలన్ ఉంటాడుగా, ఆ విలన్లే సెంట్రల్ మినిస్టర్ వెంకటరత్నం(ముఖేష్ రుషి), శశి (సంపత్ రాజ్), రాధ (హరీష్). వీరందరూ కలిసి హర్షద్ చేసే పనులను ఆపాలని ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే విలన్స్ ఓ క్రూరమైన స్టెప్ తీసుకుంటారు. దానివల్ల హర్ష తన లైఫ్ లో కావాల్సిన వాళ్ళని పోగొట్టుకుంటాడు. అదే టైంలో రవికాంత్ హర్ష ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అ టైంలోనే హర్షకి ఆ ఊరితో వాళ్ళ నాన్నకు ఉన్న సంబంధం గురించి తెలుస్తుంది.. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తీసుకుంది.? వెళ్ళిపోయిన హర్ష మళ్ళీ ఆ ఊర్లోకి వచ్చాడా.?లేదా.? దత్తత తీసుకున్న ఆ ఊరిని కాపాడటం కోసం ఏం చేసాడు.? ఇంతకీ హర్ష తన తండ్రి రవికాంత్ గురించిన తెలుసుకున్న విషయం ఏమిటి.? అన్న విషయాలను మీరు వెండితెరపై చూడాలి..
ప్లస్ పాయింట్స్ :
మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ నుంచి అభిమానులు ఏమేమి ఆశిస్తారో అలాంటి అన్ని అంశాలను ఇందులో చాలానే రాసుకున్నారు, అలా రాసుకున్న అంశాలను తెరపైన సూపర్బ్ గా చూపించడమే ఈ సినిమాకి ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. దీని తర్వాత ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అండ్ స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ గా చెప్పాల్సిన పేరు మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ బాబు ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రని తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయలేదు. డైరెక్టర్ తన పాత్రలో రాసుకున్న అన్ని వేరియేషన్స్ ని మహేష్ బాబు అద్భుతంగా పలికించాడు. ఓ రిచ్ కిడ్ గా, కాలేజ్ స్టూడెంట్ గా, లవర్ బాయ్ గా, ఊరి కోసం నిలబడే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లా, ఫ్యామిలీ మంచి కోసం ఆరాటపడే ఓ కొడుకుగా.. ఇన్ని ఎమోషన్స్ ని అనిర్వచనీయం అనేలా పండించి తనలోని ఓ సరికొత్త నటున్ని తెరపై ఆవిష్కరించాడు మహేష్ బాబు. ప్రతి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో అదరగొట్టే మహేష్ ఈ మూవీలో ఓ డిఫరెంట్ మానరిజం ఫాలో అయ్యాడు. అది చూడటానికి చాలా బాగుంది. వీటన్నిటితో పాటు పాటల్లో డాన్సులు వేసి ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించాడు. ముఖ్యంగా చారుశీల సాంగ్ లో మైఖేల్ జాక్సన్ స్టెప్స్ తో, దిమ్మ తిరిగే సాంగ్ లో మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రీ క్లైమాక్స్ లో మహేష్ చేసిన ఎమోషనల్ సీన్ ‘అదుర్స్’.
ఇక సినిమాలోని మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. హీరోయిన్ గా శృతి హాసన్ చారుశీల పాత్రలో మంచి నటనని కనబరచడమే కాకుండా పాటల్లో తన అందాలతో ఆడియన్స్ ని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా మహేష్ బాబు – శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంది. అలాగే వీరిద్దరి మధ్యా వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ ట్రాక్ చూడముచ్చటగా ఉంటుంది. మహేష్ ఫాదర్ – మదర్ పాత్రల్లో జగపతి బాబు-సుకన్యలు బాగా సెట్ అవ్వడమే, ఈ పాత్రలని వీరైతేనే పర్ఫెక్ట్ గా చేయగలరు అనేలా నటనని కనబరిచారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఊరి పెద్ద పాత్రలో చాలా బాగా చేసాడు. తన పాత్ర వల్లే సినిమాలో ఎమోషన్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇక విలన్స్ గా చేసిన ముఖేష్ రుషి, సంపత్, హరీష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడం వలనే సినిమాలో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యింది. ఇక పోతే చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సుబ్బరాజు, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, పూర్ణ, సనమ్ శెట్టి, అంగన రాయ్ లు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే.. మహేష్ బాబు పాత్ర ఎలా ఉంటుందా అనేది పరిచయం చేస్తూ సినిమాని మొదలు పెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. అక్కడే ఆడియన్స్ కథలోకి వెళ్ళడం మొదలు పెడతారు. ఆ తర్వాత వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ సినిమాలో ఉన్న ది బెస్ట్ హైలైట్స్ లో అదొకటి. ఈ లవ్ ట్రాక్ యువతని అమితంగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ ని మంచి రేంజ్ కి తీసుకెళుతుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మామిడి తోట యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. వీటన్నిటితో పాటు కొరటాల శివ ఇన్నర్ గా ‘ఊరిని దత్తత తీసుకోవడం మరియు తమ సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలని’చెప్పిన స్టొరీ లైన్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
శ్రీమంతుడు సినిమాకి ఫస్ట్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ రన్ టైం.. సుమారు 163 నిమిషాల పాటు సినిమా ఉండడం వలన చాలా చోట్ల సాగదీసిన ఫీలింగ్ తో పాటు అక్కడక్కడా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ ఎపిసోడ్ తర్వాత సినిమా స్పీడ్ కాస్త తగ్గిపోతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకూ సినిమా కాస్త నిధానంగా సాగుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ సేపు కథలోకి వెళ్ళకపోవడం మరో మైనస్. అంతే కాకుండా సినిమా మొత్తం సీరియస్ గా సాగుతూ ఉండడం వలన కొన్ని చోట్ల బోర్ కొడుతుంది.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ అయిపోయిన తర్వాత మిగతా సినిమా అంతా చాలా ఊహాజనితంగా సాగుతుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా వచ్చే ఒకటి రెండు ట్విస్ట్ లు తప్ప మిగతా అంతా రొటీన్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓవరాల్ గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ చాలా తక్కువగానే ఉన్నాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో శ్రీమంతుడు సినిమా స్థాయిని మరో రేంజ్ ని తీసుకెళ్ళిన డిపార్ట్ మెంట్స్ మూడున్నాయి. అవే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ మరియు మ్యూజిక్. మిర్చి సినిమాకి సినిమాటోగ్రఫీ సంగీతం అందించిన మది ఈ సినిమాకి కూడా ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ అందించాడు. ప్రతి లొకేషన్, ప్రతి సెట్ ని చాలా గ్రాండ్ గా చూపించడమే కాకుండా మహేష్ ని ప్రజంట్ చేసిన విధానం సింప్లీ సూపర్బ్. దేవీశ్రీ ప్రసాద్ సాంగ్స్ బాగున్నాయి, వాటిని కొరటాల శివ పిక్చరైజేషన్ పరంగా మరో మెట్టు పైకి తీసుకెళ్ళాడు. సాంగ్స్ ని పక్కన పెడితే, దేవీశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిజం ని ఎలివేట్ చేయడంలో బాగా హెల్ప్ అయ్యింది. సినిమాలో, పాటల్లో ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. తన ఆర్ట్ వర్క్ సినిమాకి చాలా ఫ్రెష్ ఫీల్ ని తెచ్చింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఓకే. చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తున్న సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది.
మహేష్ బాబుని ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. ప్రతి లుక్ సూపర్బ్ అనిపిస్తుంది, అలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన అక్షయ్ త్యాగికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అనల్ అరసు కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ మూవీ కెప్టెన్ అయిన కొరటాల శివ విషయానికి వస్తే.. స్టొరీ లైన్ లో దమ్ముంది, కథా విస్తరణ మాత్రం కాస్త రెగ్యులర్ గా ఉంది. కథా విస్తరణ రెగ్యులర్ కావడం వలన కథనం కూడా కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ని థ్రిల్ చేసే అంశాలు తక్కువయ్యాయి. డైలాగ్స్ బాగున్నాయి. కొరటాల శివ డైరెక్టర్ గానూ మంచి మార్కులే వేయచ్చు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి. వీరు పెట్టిన ప్రతి రూపాయి ఆన్ స్క్రీన్ పై గ్రాండ్ విజువల్స్ రూపంలో కనిపించి ఆడియన్స్ కి నేత్రానందాన్ని ఇస్తాయి.
తీర్పు :
మహేష్ బాబు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘శ్రీమంతుడు’ సినిమా వారి ఆశలను నిజం చేస్తూ, అభిమానులను మెప్పించే స్థాయిలో ఉండడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద విజయంగా నిలుస్తుంది. శ్రీమంతుడు సినిమా అనేది వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు వన్ మాన్ షో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మహేష్ బాబు హర్ష పాత్రలో చూపిన వేరియేషన్స్, తన డిఫరెంట్ లుక్స్ మరియు అద్భుతమైన నటన సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. మహేష్ బాబు అభిమానులు పండుగ చేసుకునేలా మహేష్ ఆన్ స్క్రీన్ కనిపిస్తాడు. ఒక సోషల్ మెసేజ్ ఉన్న పాయింట్ ని కమర్షియల్ గా చెప్పడం చాలా కష్టమైన పని, కానీ కొరటాల శివ మాత్రం ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. యూనివర్సల్ గా అందరికీ టచ్ అయ్యే స్టొరీ లైన్, మహేష్ – శృతి లవ్ ట్రాక్, ఎమోషనల్ ఎపిసోడ్స్, ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ బ్లాక్స్ అయితే ఎక్కువైన రన్ టైం, ఫస్ట్ హాఫ్ లో కథలోకి వెళ్లకపోవడం, ఊహాజనిత కథనం చెప్పదగిన మైనస్ పాయింట్స్. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మన ఊరు, ఆ ఊర్లోని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బయటకి వస్తూ మనం కూడా మన ఊరికి ఏమన్నా చెయ్యాలి అనే ఫీలింగ్ లో ఉంటారు. ఓవరాల్ గా మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడదగిన, చూడాల్సిన సినిమా ‘శ్రీమంతుడు’.